రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం ఆధునికీకరణకు భారీగా నిధులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

జాప్యానికి తావులేకుండా అర్హులైన లబ్దిదారులకు సకాలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు మంజూరు చేయాలని జిల్లా ఇంచార్జ్‌ మంత్రి, రాష్ట్ర ఎక్సయిజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ పథకం కింద లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద ఆడబిడ్డల పెళ్ళికి ఆర్ధిక సహాయం అందిస్తోందన్నారు. ఎలాంటి కాలయాపన జరగకుండా లబ్దిదారులు ఆన్లైన్‌ లో దరఖాస్తులు చేసుకున్న నెల రోజుల వ్యవధిలోనే అర్హులైన వారికి షాదిముబారక్‌, కల్యాణలక్ష్మి పథకం కింద చెక్కులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే, అందుకు గల కారణాలను దరఖాస్తుదారుడికి తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా వారికి సకాలంలో చెక్కులు మంజూరయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. దళారుల ప్రమేయం లేకుండా, పూర్తి పారదర్శకంగా శీఘ్రగతిన మంజూరీ ప్రక్రియ జరగాలని అన్నారు.

నిజానికి గత ప్రభుత్వ బాధ్యతారాహిత్య పాలన కారణంగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రతీ నెలా వడ్డీ రూపేణా రూ. 6 వేల కోట్లను ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించాల్సి వస్తోందని మంత్రి జూపల్లి ఆక్షేపించారు. అయినప్పటికీ ఎనలేని ఆర్థికభారాన్ని సైతం భరిస్తూ తమ ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమాభివృద్ధి రంగాలకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని వెల్లడిరచారు.

ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, రూ.500 లకు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రైతు రుణమాఫీని అమలు చేయడంతో పాటు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అవసరమైతే ఇతర శాఖల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

జిల్లాకు ఇంజనీరింగ్‌ కాలేజ్‌, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను మంజూరు చేయించేలా, 20, 21 ప్యాకేజీల పనులను పూర్తి చేయించేందుకు చొరవ చూపుతానని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదికగా ఉన్న రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం ఆధునికీకరణకు రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ, 2007 వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డితో కలిసి తన ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు చేయూతను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని గుర్తు చేసుకున్నారు.

ఈ తోడ్పాటు క్రమక్రమంగా పెరుగుతూ, ప్రస్తుతం షాదిముబారక్‌, కల్యాణలక్ష్మి కింద లక్షా 116 రూపాయల చొప్పున లబ్దిదారులకు తోడ్పాటును అందించడం జరుగుతోందన్నారు. భవిష్యత్తులో ఈ మొత్తాన్ని మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, త్వరలోనే ప్రభుత్వం తీపి కబురు అందజేస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు పార్టీలకు అతీతంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.

అర్బన్‌ శాసన సభ్యులు ధన్పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ, నిర్లక్ష్యానికి గురైన నిజామాబాద్‌ నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. రాజకీయాలకు అతీతంగా నగర ప్రగతికి సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అనిల్‌ ఈరవత్రి, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »