కామారెడ్డి, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆసుపత్రులను తనిఖీ చేసి రిజిస్ట్రేషన్ కోసం అనుమతులకు సిఫారసు చేయాలని జిల్లా కలెక్టర్, చైర్మన్, జిల్లా రిజిస్ట్రేషన్ అధారిటీ కమిటీ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రతిపాదనలను సంబంధిత అధికారులు చట్టం ప్రకారం పరిశీలించి సిఫారసు చేయాలని అన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 127 ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత సమావేశంలో 19 ప్రతిపాదనలు రాగా 17 ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చుటకు అంగీకరించినట్లు తెలిపారు. జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు, ల్యాబ్ లు జిల్లా రిజిస్ట్రేషన్ అధారిటీ అనుమతితో రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. జిల్లా కమిటీ ప్రతీ నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటుచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ని ఆదేశించారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ కానీ ఆసుపత్రులను తనిఖీ చేసి నోటీసులు జారీచేయడంతో పాటు ఫైన్ విధించాలని అన్నారు.
రిజిస్టర్ అయిన ఆసుపత్రుల డాక్టర్లు మారితే వెంటనే అట్టి సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కి తెలియ జేయాలని తెలిపారు. గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్యుల పేర్లు, వివరాలు తెలిపే బోర్డ్లు ఏర్పాటుచేయాలని, చికిత్సలకు చెల్లించు టారిఫ్ వివరాల బొర్డ్లు ఏర్పాటుచేయాలని, ఫైర్ సేఫ్టీ, బయో వేస్ట్, తదితర వాటిని పరిశీలించాలని తెలిపారు. తనిఖీ కొరకు వచ్చే అధికారులకు సహకరించాలని, ప్రతీ నెల రిపోర్ట్స్ అందజేయాలని తెలిపారు.
సమావేశంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్ర శేఖర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డా. ఏం.వి. రమణ, ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.