కామారెడ్డి, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని జాతీయ రహదారులు నేం.44, 161 ల పై జరుగుతున్న ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
టేక్రియాల్, పొదుర్తి, భిక్నూర్ గ్రామాల వద్ద ప్రమాదాల సూచికలు ఏర్పాటుచేయాలని, స్టిక్కర్లు అంటించాలని తెలిపారు.అదేవిధంగా జంక్షన్ ల వద్ద లైటింగ్ ఏర్పాటుచేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా వాహనాలు రోడ్డుపై పార్కింగ్ చేస్తే ఫైన్ విధించాలని సూచించారు. మండల స్థాయిల్లో పాఠశాల విద్యార్థులతో రోడ్డు భద్రత లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. రోడ్లు బావణాల శాఖ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలు నివేదికలు సమర్పించాలని తెలిపారు. అవసరమైన బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో సూచికలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
పాఠశాలలు, కళాశాలల ప్రాంతాల్లో జీబ్రా సూచికలను ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను అన్ని శాఖల సహకారంతో అరికట్టాలని తెలిపారు. బ్లడ్ బ్యాంకులో అవసరమైన రక్తం అందుబాటులో ఉంచాలని, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు. గుర్తించిన స్టాప్ లో ఆర్టీసీ బస్సులను నిలిపే విధంగా చూడాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ను ఆదేశించారు.
సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి, రోడ్లు భవనాలు శాఖ ఈఈ రఘు శంకర్, డిఎస్పీ నాగేశ్వర్ రావు, జిల్లా విద్యాశాఖాధికారి రాజు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, ఆర్టీవో శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రశేఖర్, జాతీయ రహదారుల అధికారులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.