ఆర్మూర్, అక్టోబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆలూర్ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబోరేటరీ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి, టెక్నీషియన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం స్థానికంగానే యంత్రాలను వినియోగిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా అన్ని పీ.హెచ్.సీలలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తన వెంట ఉన్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నిర్ధారణ కోసం రాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయా అని పీ.హెచ్.సీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గది, ఓపి, ఇన్ పేషంట్ వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వాక్సిన్లను భద్రపరిచిన గదిని తనిఖీ చేసి, అవసరమైన ఔషధాలను శీతలీకరణలో ఉంచేందుకు ఫ్రిడ్జ్ లను వినియోగిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు.
పాము కాటుకు గురైన వారికి వైద్య సేవలలో వినియోగించే యాంటీ వీనమ్ మెడిసిన్, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లను ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. కాగా, దేగాం ఆరోగ్య కేంద్రానికి సుమారు ఐదెకరాల సువిశాల విస్తీర్ణం కలిగిన ఆవరణ పచ్చదనంతో కూడి ఉన్నప్పటికీ, ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగిపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల పరిసరాలను శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టినప్పటికీ, అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.