కామారెడ్డి, అక్టోబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వరి ధాన్యం సేకరణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో వానా కాలం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2300, సన్నరకం వడ్లకు అదనంగా రూ.500 చెల్లిస్తున్నదని తెలిపారు. సన్నరకం ధాన్యం గుర్తించడానికి సన్నరకం ధాన్యం నింపిన బస్తాలకు ఎర్రదారంతో కుట్టి ఎస్ అనే అక్షరం ముద్రించాలనీ ఆదేశించారు.
దొడ్డురకం ధాన్యం బస్తాలకు ఆకుపచ్చ దారంతో కుట్టాలని సూచించారు. రెండిరటినీ వేరు వేరు లారీల్లో నింపి మిల్లులకు తరలించాలని తెలిపారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద త్రాగునీటి వసతి, ఎండ నుంచి రక్షణ కోసం టెంట్లు ఏర్పాటుచేయాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని అన్నారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, జిల్లా సహకార అధికారి రాం మోహన్, డి. పి.ఏం.రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.