రుద్రూర్, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జెడ్పి హైస్కూల్ లో చేపట్టిన పనులను పరిశీలించి, ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో వేర్వేరుగా జరుగుతున్న బోధనా తీరును పరిశీలించారు. విద్యార్థుల సామర్ధ్యాన్ని పెంపొందించేలా నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు సులభంగా ఆకళింపు చేసుకునే విధంగా, వారికి అర్ధమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ 9 తరగతి గదిని సందర్శించి, విద్యార్థినులకు పలు ప్రశ్నలు అడిగి వారి సామర్ధ్యాన్ని తెలుసుకున్నారు. ఆయా సబ్జెక్టుల వారీగా వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తిస్తూ, అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఉపాధ్యాయినులకు సూచించారు.
పాఠశాలలో ఆరుబయట మధ్యాహ్న భోజనం అన్నం వండుతుండడాన్ని గమనించిన కలెక్టర్ వంట గది ఎందుకు వినియోగించుకోవడం లేదని నిర్వాహకులను ప్రశ్నించారు. విద్యార్థినులకు అందించే భోజనం కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించేలా అనునిత్యం పర్యవేక్షణ జరపాలని పాఠశాల హెచ్.ఎంను ఆదేశించారు.
అంతకుముందు రుద్రూర్ పీ.హెచ్.సీని సందర్శించిన కలెక్టర్, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడిచిన నెలన్నర రోజుల నుండి ఎన్ని డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి, సీజనల్ వ్యాధుల పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు.
పీ.హెచ్.సీ పరిధిలో గత సెప్టెంబర్ నెలలో 7 డెంగ్యూ కేసులు నమోదవగా, ప్రస్తుత అక్టోబర్ మాసంలో ఇప్పటివరకు కేవలం రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని, సీజనల్ వ్యాధుల తీవ్రత కూడా తగ్గుముఖం పట్టిందని వైద్యులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ అన్ని రకాల మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లను తనిఖీ చేసిన కలెక్టర్, స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు, పంచాయతీరాజ్ ఈ.ఈ శంకర్ తదితరులు ఉన్నారు.