ఆర్మూర్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి 29వ తేదీ వరకు ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ పై రెండు రోజుల పాటు ఛాయాచిత్ర పదర్శన ఏర్పాట్లు చేసినట్లు సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ తెలిపారు.
అందులో భాగంగా సిబిసి ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ పై విద్యార్థులకు వ్యాసరచన, రంగోలి పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, రంగోలి పోటీలను ఆర్ముర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వేణు ప్రసాద్, సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ పరిశీలించారు.
ఈ సందర్భంగా సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ మాట్లాడుతూ…. వ్యాసరచన, రంగోలి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ ఫోటో ఎగ్జిబిషన్ లో అతిథులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు.
ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఈ నెల 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఆర్మూర్ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభిస్తారని తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఈబీఎస్‌బీ) కింద జత చేసిన హర్యానా, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ ఆసక్తికరమైన అంశాలు, కళా రూపాలు, వంటకాలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడలు మొదలైన వాటిని తెలియజేసేలా ఈ ఛాయా చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ ఎగ్జిబిషన్ 2024 అక్టోబర్ 28 నుంచి 29వ వరకు ఆర్ముర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఉచితంగా వీక్షించేందుకు తెరిచి ఉంటుందన్నారు. కావున ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఛాయా చిత్ర ప్రదర్శనలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.