కామరెడ్డి, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశురక్ష వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న రెండు సంవత్సరాల చిన్నారి దీక్షిత (2) కి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం కోసం రక్తనిధి కేంద్రాలలో సంప్రదించినప్పటికీ అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ సేవాదని రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో వెంటనే స్పందించి వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్ రెడ్డి సహకారంతో సకాలంలో బి నెగిటివ్ రక్తాన్ని అందజేయడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేస్తూ ఆపదలో ఉన్న ఎందరో గర్భిణీ స్త్రీలకు,డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి, అనీమియా వ్యాధిగ్రస్తులకు,వివిధ ఆపరేషన్ల నిమిత్తమై రక్తాన్ని అందజేస్తున్న రక్తదాత వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్ రెడ్డి కి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్,ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా తరఫున అభినందనలు తెలిపారు.
వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయం ఇప్పటివరకు అందుబాటులో లేదని మానవత్వంతో ఉన్న వ్యక్తులు ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని విజ్ఞప్తి చేశారు.