నిజామాబాద్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల స్థితిగతులపై రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.
సరిహద్దు చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా కొనసాగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఉమ్మడి తనిఖీ కేంద్రాల వద్ద ఇంకనూ ఏవైనా సదుపాయాలు అవసరం ఉన్నట్లయితే ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, పొరుగున గల మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న జిల్లాలోని సాలూరా, కందకుర్తి, పోతంగల్, ఖండ్ గాం ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. రవాణా, అటవీ, ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖలు ఉమ్మడి చెక్ పోస్టుల వద్ద సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని అన్నారు.
ప్రతి చెక్ పోస్టు వద్ద రెండు చొప్పున సీ.సీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా అనునిత్యం పకడ్బందీ పర్యవేక్షణ జరిపిస్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.