కామారెడ్డి, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పాఠశాల విద్యను పూర్తిచేసిన తరువాత భవిష్యత్తులో అవసరానికి అనువైన విద్యను అభ్యసించాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పదవతరగతి విద్యను అభ్యసిస్తున్న తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులు చదువుతున్న పుస్తకాలను అడిగి తెలుసుకున్నారు.
పదవ తరగతి అయిన తర్వాత ఏం చేస్తారు అని విద్యార్థులను అడుగగా, ఇంటర్ విద్యను అభ్యసిస్తామని వారికి సమీపంలోని గ్రామాల్లోగల కళాశాలల్లో చేరుతామని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాం ప్రతీ ఒక్క విద్యార్థి ధరించాలని సూచించారు. హాస్టల్ లో భోజనం ఎలా వుంటుంది అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆయా మెడికల్ ఆఫీసర్ ఆనంద్ జాదవ్ ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రిలోని జనరల్ వార్డ్, ఫ్యామిలీ ప్లానింగ్ వార్డ్, స్టార్స్ రూం లను పరిశీలించారు. ఆసుపత్రిలోని వైద్య అధికారులు, సిబ్బంది లకు సంబంధించిన హాజరు రిజిస్టర్ లను కలెక్టర్ పరిశీలించారు. నెలవారీ ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, ప్రతీ నెలా 10 నుండి 15 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సుల కొరత ఉందని తెలిపారు. అనంతరం తహాసిల్ కార్యాలయం లోని రికార్డు గదిని సందర్శించారు.
అనంతరం సలబాత్పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వరి ధాన్యం సేకరణ జరుగుతున్నదని, మహారాష్ట్ర నుండి ధాన్యం రవాణా కాకుండా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని తెలిపారు.
అదేవిధంగా మహారాష్ట్రా లో శాసనసభ ఎన్నికల దృష్ట్యా పోలీసులు మన జిల్లా, రాష్ట్రం గుండా వెళ్లే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ ముజీబ్, ఇన్చార్జి ఎంపీడీఓ బి.వెంకట నరసయ్య, ఆర్టీవో శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.