నిజామాబాద్, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఉమ్మడి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్న తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఆదివారం నిజామాబాద్ నగరానికి చేరుకుంది. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వద్ద బీ.సీ కమిషన్ బృందానికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.
కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి,లు విచ్చేయగా, అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి స్రవంతి తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. కమిషన్ చైర్మన్, సభ్యులు జిల్లా అధికారులతో భేటీ అయ్యి స్థానిక పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు.
అనంతరం బీసీ కమిషన్ బృందం సభ్యులు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం సందర్శన కోసం బాసర పుణ్యక్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేసుకుని తిరిగి నిజామాబాద్ కు చేరుకోనున్న బీ.సీ కమిషన్ బృందం స్థానికంగా రాత్రి బస చేయనుంది. ఈ నెల 29 (మంగళవారం) ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అభిప్రాయ సేకరణ జరుపనున్నారు.
ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.00 గంటల వరకు కామారెడ్డి జిల్లాకు చెందిన వారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల దామాషాపై తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా కమిషన్ కు నివేదించవచ్చని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. స్వాగతం పలికిన వారిలో బీసీ అభివృద్ధి శాఖ సహాయ అధికారి నర్సయ్య, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న తదితరులు ఉన్నారు.