నిజామాబాద్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుల బృందం ఈ నెల 29న (మంగళవారం) నిజామాబాద్ కు విచ్చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం తెలిపారు.
ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని తెలంగాణ బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని వెల్లడిరచారు. ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు, మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు తమ అభిప్రాయాలను కమిషన్ కు తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు.
నిర్దేశిత నమూనాలో వెరిఫికేషన్ అఫిడవిట్ తో పాటు ఆరు సెట్లను తెలుగు లేదా ఆంగ్ల భాషలో ఇవ్వాల్సి ఉంటుందని, వారి వాదనలకు మద్దతుగా వారి వద్ద ఉన్న సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలను, సంబంధిత కేసుల వివరాలను పేర్కొంటూ, సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను కమిషన్ కు నివేదించవచ్చని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.