సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలి….

కామరెడ్డి, అక్టోబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మధిర తహసిల్దార్‌ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

ప్రజా ప్రభుత్వం ఉన్నతమైన ఆలోచనతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపడుతుందని, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను వారికి మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేసేందుకు ఈ సర్వే ఉపయోగిస్తామని అన్నారు. ప్రజా ప్రభుత్వం చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లక్షలాది మంది జీవితాల్లో మార్పు తీసుకుని వస్తుందని, అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రతి ఇంటి నుంచి వివరాలు సేకరణ జరగాలని, దానికి తగిన విధంగా ప్లాన్‌ తయారు కావాలని అన్నారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా నియమించాలని, ఇలాంటి పెద్ద స్థాయి సర్వేలలో గత అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్యుమరేటర్‌, సూపర్వైజర్‌ లకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. సర్వే నిర్వహణకు అవసరమైన ఫారంలు, మార్గదర్శకాలు, ముద్రణ, స్టేషనరీ ఏర్పాట్లు చేయాలని, ఇండ్ల జాబితా చేపట్టాలని అన్నారు.

సర్వే షెడ్యూల్‌ వివరాలు ప్రజలకు చేరేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, నవంబర్‌ 6 నుంచి సర్వే ప్రారంభించాలని, సర్వే చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, ధరణి పాస్‌ పుస్తకాలు కుటుంబం దగ్గర ఉంచుకునేలా ప్రచారం చేయాలని అన్నారు. సర్వే వివరాలను ఆన్‌ లైన్‌ లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించాలని అన్నారు.

కరీంనగర్‌ నుంచి పాల్గోన్న రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ చరిత్రలో నిలిచిపోయే ప్రక్రియ అవుతుందని అన్నారు. సర్వే నిర్వహణపై శాసనసభ తీర్మానం ప్రవేశపెట్టి, క్యాబినెట్‌ లో ఆమోదం పొంది సంబంధిత ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేయాలని అన్నారు. సూపర్‌ వైజర్‌ లు సర్వే వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ క్రాస్‌ చెక్‌ చేసుకోవాలని అన్నారు. సీఎస్‌ నుంచి క్షేత్రస్థాయి అధికారి వరకు సమన్వయంతో పని చేస్తూ ఏ తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలని, దేశానికే రోల్‌ మోడల్‌ అయ్యే విధంగా మన పని తీరు ఉండాలని అన్నారు.

విసి లో పాల్గొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, సర్వే నిర్వహణ షెడ్యూల్‌ ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. సర్వే పూర్తి చేసిన ఇంటికీ స్టిక్కర్‌ అంటించాలని అన్నారు. నవంబర్‌ 6 నుంచి సర్వే ప్రారంభమవుతుందని, ప్రతి ఇంటి సర్వే పూర్తిచేసి వివరాలు ఆన్‌ లైన్‌ లో పక్కాగా నమోదు చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా సీఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ ల బాధ్యతలు స్పష్టంగా తెలియజేసామని, ఏ ఇల్లు మిస్‌ కాకుండా ప్రక్రియ పూర్తి చేయాలని, షేడ్యూల్‌ రూపకల్పన, స్టిక్కర్‌, అవసరమైన సామాగ్రి సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్‌ వైజర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ నియామకం జరగాలని, వీరికి జిల్లా స్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలని, ప్రజల వివరాలకు గోప్యత పాటించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్యుమరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు అందించాలని సీఎస్‌ సూచించారు.

అనంతరం ధాన్యం కొనుగోలుపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ సమీక్షిస్తూ జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో వచ్చే దాన్యం దిగుబడి, అందుబాటులో ఉన్న గోడౌన్‌ సామర్థ్యం మేరకు అవసరమైతే ఇంటర్మీడియట్‌ గోడౌన్లను సిద్ధం చేసుకోవాలని అన్నారు.

మిల్లింగ్‌ చార్జీలు గతంలో చాలా తక్కువగా ఉండేవని, వీటిని పెంచేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సు చేసిందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకుండా చూడాలని అన్నారు. వీడియో సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు, జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌ రెడ్డి, వి.విక్టర్‌, ఇతర అధికారులు, పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »