కామరెడ్డి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు క్యాతం వెన్నెల సృజన్ బుధవారం జన్మదిన సందర్భంగా 11వసారి ఏ పాజిటివ్ రక్తాన్ని ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో అందజేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతి జన్మదినానికి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న రక్తదాత క్యాతం వెన్నెల సృజన్ కు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలియజేశారు.ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ప్రత్యేకమైన రోజులను పురస్కరించుకొని రక్తదానానికి ముందుకు రావాలని, ఒక రక్తదాత ఇచ్చే రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చునని రక్తదానం ప్రాణదానం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు ఎరగాలని అన్నారు.
దేశవ్యాప్తంగా సకాలంలో రక్తం అందక చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది క్యాతం సిద్ధ రాములు, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.