నిజామాబాద్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ఈ నెల 6 వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కాగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఆయా నివాస ప్రాంతాలలో ఇళ్ల జాబితాల రూపకల్పన ప్రక్రియ శుక్రవారం ప్రారంభమవగా, జిల్లా పాలనాధికారి క్షేత్రస్థాయి సందర్శన జరిపి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు.
బోధన్ మున్సిపల్ పట్టణంలోని రాకాసిపేట్ తో పాటు లంగ్డాపూర్ గ్రామంలో అధికారులు, సిబ్బంది ఇళ్ల జాబితా రూపకల్పన కోసం చేపడుతున్న చర్యలు, పాటిస్తున్న పద్ధతులను కలెక్టర్ పరిశీలన జరిపారు. ఇళ్లకు సర్వేకు సంబంధించిన స్టిక్కర్లను అతికిస్తూ, వాటిపై నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు కీలక సూచనలు చేశారు. ఏ ఒక్క నివాస గృహం సైతం మినహాయించబడకుండా పక్కా పరిశీలనతో హౌస్ లిస్టింగ్ చేయాలని, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.
ముఖ్యంగా మున్సిపల్ పట్టణాల పరిధిలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. సర్వే కోసం ఎన్యుమరేషన్ బ్లాక్ లోని ప్రతి ఇంటికి క్రమానుగత సంఖ్యను కేటాయించాలని, ఇళ్ల జాబితా పక్కాగా రూపొందితే సర్వే సమగ్రంగా చేపట్టబడుతుందని అన్నారు. నిర్దేశిత సర్వే ప్రణాళికను అనుసరిస్తూ మూడు రోజుల్లోపు హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎక్కడ కూడా డూప్లికేషన్ లేకుండా హౌస్ లిస్టింగ్ చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ జిల్లాలో సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ నెల 06 వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఇంటింటి సమగ్ర సర్వే ప్రక్రియపై ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, తహసీల్దార్ విఠల్ తదితరులు ఉన్నారు.