బోధన్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. బోధన్ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయం నిర్మాణ పనులను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఇప్పటివరకు కేవలం బేస్ లెవెల్ వరకే నిర్మాణం పనులు జరగడాన్ని గమనించిన కలెక్టర్, పనుల్లో జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. వర్షపు జలాలు నిలిచి ఉండడంతో పనులు చేపట్టలేకపోయామని, ఇకపై వేగంగా పనులు చేపట్టి వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఐ.టీ.సీలలో తరగతులు నేటి నుండి ప్రారంభం అయినందున భవన నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
కాగా, సొంత భవనాలు అందుబాటులోకి వచ్చే లోపు ప్రత్యామ్నాయంగా ఐ.టీ.ఐలలో ఏ.టీ.సీ తరగతులను నిర్వహించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులకు శిక్షణ కోసం కేటాయించబడిన యంత్రసామాగ్రి, ఇతర మెటీరియల్ పూర్తి స్థాయిలో వినియోగం అయ్యేలా చూడాలన్నారు. నాణ్యతతో యుద్ధప్రాతిపదికన భవన నిర్మాణ పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ విఠల్, వైస్ ప్రిన్సిపాల్ సరోజినీదేవి తదితరులు ఉన్నారు.