కామారెడ్డి, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా, ధాన్యం కొనుగోళ్లపై తీసుకోవాల్సిన చర్యల గురించి పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహన్ అధికారులకు సూచించారు.
మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని అన్నారు. సన్న రకం ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని తెలిపారు.
జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం దాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ప్యాడీ క్లీనర్, ఇతర సామాగ్రి వెంటనే యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అన్నారు. దొడ్డు రకం ధాన్యం సన్న రకం కోనుగోలు కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దని అన్నారు.
జిల్లాలో రైస్ మిల్లర్ల వద్ద తాలు పేరుతో ఎటువంటి ధాన్యం కోతలు చేయవద్దని, కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలని, రైతులకు ఎటువంటి నష్టం రావడానికి వీలు లేదని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని మంత్రి సూచించారు.
జిల్లాలోని రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు కోసం బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని, వీటిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లతో సమావేశాలునిర్వహించాలని, ప్రభుత్వ ఉత్తర్వులు 27 పై చర్చించాలని, రైస్ మిల్లర్లచే బ్యాంక్ గ్యారంటీ తీసుకుని ధాన్యం కేటాయింపు చేయవచ్చని అన్నారు.
రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ సమర్పించని పక్షంలో జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం భద్ర పరిచేందుకు అవసరమైన మేర ఇంటర్మీడియట్ గోడౌన్ సన్నద్ధం చేయాలని, ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు ఫోన్ నెంబర్‌తో కూడిన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 48 గంటల్లో చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. పక్క రాష్ట్రాల ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా బార్డర్ల వద్ద చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో 423 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు ధాన్యం కొనుగోళ్ళ ప్రారంభించడం జరుగుతున్నాయని తెలిపారు. కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అవసరమైన గోదాం లను గుర్తించడం జరిగిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్చార్జి పౌరసరఫరాల అధికారి నరసింహారావు, జిల్లా సహకార అధికారి రాం మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, తదితరులు పాల్గొన్నారు.