డిచ్‌పల్లి, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ యూనివర్సిటీ మెయిన్, సౌత్ మరియు బిఈడి క్యాంపస్ సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పీ.డీ.ఎస్.యు.) ఆధ్వర్యంలో తే.యూ. ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేష్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణం పూర్తిగా చెడిపోయిందన్నారు. ముఠాలు, గ్రూపులుగా విభజించబడి కొద్దిమంది తమ స్వప్రయోజనాల కోసం యూనివర్సిటీ, విద్యార్థుల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అంటే వివాదాలకు కేంద్ర బిందువుగా అపఖ్యాతి తెచ్చుకున్నదని తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని ఉపకులపతిని కోరారు. పైరవీ కారులకు చెక్ పెట్టాలని, అక్రమ నియామకాలపై చర్యలు తీసుకోవాలని, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. యూనివర్సిటీకి చెందిన 576 ఎకరాల భూమిని కాపాడాలని, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి, పరిష్కరించాలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించి, యూనివర్సిటీకి మంచి గుర్తింపును తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని విన్నవివించారు. బాలికల సంఖ్యకు అనుగుణంగా మరో వసతి గృహాన్ని నిర్మించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టులను యు.జి.సి నిబంధనల ప్రకారం భర్తీచేయాలన్నారు.
ప్రస్తుతం విద్యార్థుల నుండి తీసుకుంటున్న అడ్మిషన్, ఎగ్జామ్ ఫీజులను తగ్గించాలనీ, యూనివర్సిటీ అన్ని క్యాంపస్ లల్లో బయోమెట్రిక్ విధానాన్ని పక్కాగా అమలుచేయాలన్నారు. మెయిన్ క్యాంపస్ మరియు సౌత్ క్యాంపస్ లో క్రీడా సంబంధించిన మైదానాలను పటిష్టం చేసి, క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు.
యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలన్నారు. సౌత్ క్యాంపస్ లో అన్ని వసతులతో కూడిన లైబ్రరీ ఏర్పాటు చేయాలని, యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా జరిగిన నియమకాలను తక్షణమే రద్దు చేసీ,యుజిసి నిబంధనల ప్రకారం కొత్తగా నోటిఫికేషన్ వేసి, భర్తీ ప్రక్రియ చేపట్టాలన్నారు. సంప్రదాయ కోర్సులను కొనసాగిస్తూనే, పరిస్థితులకనుగుణంగా అగ్రికల్చర్, ఇతర టెక్నికల్ కోర్సులను ప్రవేశపెట్టాలన్నారు.
పరిశోధనలకు పెద్దపీట వేయాలి. పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు యూనివర్సిటీ నుండి ఫెలోషిప్ సౌకర్యం కల్పించాలన్నారు. యూనివర్సిటీలో అడ్వాన్స్ పరిశోధన రంగంపై దృష్టి కేంద్రీకరించి, యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించాలని కోరారు. కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు. జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.అనిల్ కుమార్, అషూర్, కోశాధికారి నిఖిల్ జిల్లా నాయకులు రాజేష్, బన్నీ. తదితరులు పాల్గొన్నారు.