నిజామాబాద్, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వ రంగంలో నెలకొల్పబడిన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు పూర్వ వైభవం చేకూర్చేందుకు అన్ని వర్గాల వారు తమవంతు తోడ్పాటును అందించాలని ఆ సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కోరారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓ లతో చైర్మన్ అధ్యక్షతన నిజామాబాద్, కామారెడ్డితో కూడిన ఉమ్మడి జిల్లా సమన్వయ సమావేశం జరిగింది. 2024 -2025 యాసంగి సీజన్ లో విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు ఆయా పంటల సాగుకు అవసరమైన విత్తనాలను సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి, సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు అధిక దిగుబడులు సాధించేలా నాణ్యమైన విత్తనాలు అందించాలనే లక్ష్యంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 1976 లో ప్రభుత్వం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను నెలకొల్పిందని గుర్తు చేశారు. తదనుగుణంగానే నాణ్యమైన విత్తనాలకు విత్తనాభివృద్ధి సంస్థ మారుపేరు అనే నమ్మకాన్ని పొందగలిగిందని అన్నారు. అయితే గత ప్రభుత్వ నిర్లిప్త ధోరణి కారణంగా గడిచిన పదేళ్ల కాలంలో విత్తనాభివృద్ధి సంస్థ తన ప్రభావాన్ని కోల్పోయిందని ఆక్షేపించారు.
ప్రైవేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని, నకిలీ, నాసిరకం విత్తనాలతో అనేక చోట్ల రైతులు మోసపోతూ నష్టాలను చవిచూడాల్సి పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని నివారిస్తూ రైతులకు మేలు చేకూర్చేందుకు గాను సహకార సంఘాల ద్వారా విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలని నిర్ణయించామన్నారు. దీనివల్ల రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు సహకార సంఘాలకు, విత్తనాభివృద్ధి సంస్థకు కూడా మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే యాసంగి సీజన్లో సుమారు ఐదున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారని, లక్షా 20 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయన్నారు. సంస్థ ద్వారా మేలు రకం విత్తనాలను ఉత్పత్తి చేసి, సకాలంలో రైతులకు అందించాలనే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ లక్ష్యానికి వ్యవసాయ, సహకార శాఖలు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా అందించే విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి గ్రామగ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తూ రైతులు వీటినే కొనుగోలు చేసేలా అవగాహనను పెంపొందించేలా చొరవ చూపాలని కోరారు.
ప్రైవేట్ కంపెనీల విత్తనాలు మొలకెత్తక పెట్టుబడులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇలా జరిగిన సందర్భాల్లో ప్రైవేట్ కంపెనీలు ఎలాంటి బాధ్యత వహించవని అన్నారు. విత్తన చట్టంలో అనేక లొసుగులు నెలకొని ఉండడం వల్లే ప్రైవేట్ కంపెనీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని చైర్మన్ అన్వేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విత్తన చట్టంలో సమగ్ర మార్పులు తెచ్చేలా చూస్తామన్నారు. రైతులు ప్రైవేట్ కంపెనీల విత్తనాలను కొని మోసపోవద్దని, విత్తనాభివృద్ధి సంస్థ అందించే నాణ్యమైన విత్తనాలనే వినియోగించాలని హితవు పలికారు.
అందరి సహకారంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను సీడ్ హబ్‌గా తీర్చిదిద్ధేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, సీడ్స్ కార్పొరేషన్, ఆగ్రోస్, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు పాల్గొన్నారు.