నిజామాబాద్, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దర్పల్లి మండలం సీతాయిపేట్లో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఇప్పటివరకు ఎంత పరిమాణంలో సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని సేకరించారు, ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ టాగ్ అయ్యిందా, కొత్త గన్నీ బ్యాగులు అందాయా అని ఆరా తీశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఓపీఎంఎస్ తో పాటు లోకల్ యాప్ లోనూ నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రైతుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా 629 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసారి సన్న రకం, దొడ్డు రకం ధాన్యం సేకరణకై వేర్వేరుగా కేంద్రాలను అందుబాటులో ఉంచామని వివరించారు. కనీస మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేయనున్నదని, ఈ మేరకు ఓపీఎంఎస్ తో పాటు ఆన్లైన్లో లోకల్ యాప్లో వివరాలు నమోదు చేయిస్తున్నామని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేశామని అన్నారు. అన్ని కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచామని, లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరుగుతోందని తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.