నిజామాబాద్, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ మార్గంలో అడవిమామిడిపల్లి వద్ద ఆర్.యూ.బీ(రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణం పనులు కొనసాగుతున్న దృష్ట్యా, ఈ నెల 17, 18 తేదీలలో గ్రూప్ -3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించబడిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.
అడవిమామిడిపల్లి వద్ద ఆర్.యు.బీ పనులు జరుగుతున్నందున నవంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు నెల రోజుల పాటు నిజామాబాద్ – ఆర్మూర్ మార్గంలో వాహనాల రాకపోకలను దారిమళ్లించడం జరిగిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రూప్-3 పరీక్షల కోసం ఆర్మూర్ వైపు వెళ్లాల్సిన వారు, ఆర్మూర్ నుండి నిజామాబాద్ వైపు వచ్చే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉన్నందున నిర్ణీత సమయం కంటే ముందుగానే బయలుదేరాలని కలెక్టర్ సూచించారు.