నిజామాబాద్, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రెంజల్ మండల కేంద్రంలో ఐకెపి మహిళా సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు.
ఈ కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యం నిల్వలను, వాటి నాణ్యతను పరిశీలించారు. మాయిశ్చర్ మీటర్ ద్వారా ధాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యం తీసుకువచ్చేలా విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సన్నరకం ధాన్యం సేకరిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, ఇప్పటివరకు ఎంత పరిమాణంలో ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకా ఎంత పరిమాణంలో ధాన్యం కేంద్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులను ప్రశ్నించారు.
గత సంవత్సరం రబీ, ఖరీఫ్ సీజన్లలో కొనుగోలు కేంద్రం ద్వారా సేకరించిన ధాన్యం నిల్వల వివరాల గురించి ఆరా తీశారు. ఈసారి ముందస్తుగా కోతలు పూర్తయిన రైతులు పచ్చి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలుకు సుమారు రూ. 2200 ధర చొప్పున విక్రయించుకున్నారని, కొంత ఆలస్యంగా పంట కోతలు జరిపిన రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెస్తున్నారని, గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం కొంత తక్కువ పరిమాణంలో ధాన్యం వస్తోందని కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
గోనె సంచుల కొరత, రవాణాపరమైన ఇబ్బందులు వంటివి ఏమీ లేవని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటదివెంట ధాన్యం కొనుగోళ్లు జరపాలని, సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ పీ.డీ సాయాగౌడ్, ఐకెపి డీపీఎం సాయిలు, తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.