నిజామాబాద్, నవంబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 17, 18వ తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. 17న ఉదయం 10.00 గంటల నుండి మధ్యాన్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని, ఆ మరుసటి రోజైన 18వ తేదీన ఉదయం సెషన్ లో పరీక్ష ఉంటుందని వివరించారు.
జిల్లాలో మొత్తం 19941 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా మొత్తం 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాయని అన్నారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా ప్రతి మూడు కేంద్రాలకు ఒకరు చొప్పున 22 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించామని, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు అనుక్షణం నిశిత పర్యవేక్షణ జరుపుతామని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
బయో మెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉదయం పరీక్షకు సంబంధించి 9.30 గంటల వరకే పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, అనంతరం గేట్లు మూసివేస్తారని, మధ్యాహ్నం పరీక్షకు సంబంధించి 2.30 తరువాత ఎవరినీ లోనికి అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.
చీఫ్ సూపరింటెండెంట్ కు తప్ప మరెవ్వరికి పరీక్షా కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రం లోకి మొబైల్ ఫోన్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని, ఈ మేరకు ప్రతి కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించామన్నారు. పరీక్షా సమయం ప్రారంభం నుండి ముగిసేంత వరకు పరీక్ష కేంద్రం నుండి అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా బయటకు వెళ్లకూడదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు.
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
ఆర్మూర్ మార్గంలో అడవిమామిడిపల్లి వద్ద ఆర్.యూ.బీ(రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణం పనులు కొనసాగుతున్న దృష్ట్యా, ఈ నెల 17, 18 తేదీలలో గ్రూప్ -3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించబడిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
అడవిమామిడిపల్లి వద్ద ఆర్.యు.బీ పనులు జరుగుతున్నందున నవంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు నెల రోజుల పాటు నిజామాబాద్ – ఆర్మూర్ మార్గంలో వాహనాల రాకపోకలను దారిమళ్లించడం జరిగిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రూప్-3 పరీక్షల కోసం ఆర్మూర్ వైపు వెళ్లాల్సిన వారు, ఆర్మూర్ నుండి నిజామాబాద్ వైపు వచ్చే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉన్నందున నిర్ణీత సమయం కంటే ముందుగానే బయలుదేరాలని కలెక్టర్ సూచించారు.