నిజామాబాద్, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆదివారం ఉదయం జరిగిన మొదటి సెషన్ పరీక్షకు జిల్లాలో మొత్తం 19,941 మంది అభ్యర్థులకు గాను, 10,037 మంది హాజరు కాగా, 9904 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు.
ఉదయం సెషన్ లో 50.33 శాతం హాజరు నమోదయ్యిందని అన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 9992 మంది అభ్యర్థులు హాజరవ్వగా, 9949 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. సెకండ్ సెషన్ లో 50.10 శాతం హాజరు నమోదయ్యిందని వివరించారు.

సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే గ్రూప్-3 పరీక్షకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ, నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయడం జరుగుతుందని, అనంతరం లోనికి అనుమతించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు.