నిజామాబాద్, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తైన సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే అట్టహాసంగా ప్రజా కళాయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్‌ల నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రజా పాలన కళా యాత్ర చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించడం జరిగిందని, దీనికి సంబంధించి సన్నాహక ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన కళాయాత్ర ప్రతినిధులు ప్రోఫెసర్ అలేఖ్య పుంజల, అంతడుపుల నాగరాజు నేతృత్వంలోని బృందాలు రాష్ట్రమంతా పర్యటిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 20న అంతడుపుల నాగరాజు బృందం ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఆన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు.
వేదికను అందంగా, ఆకట్టుకునే రీతిలో ముస్తాబు చేయాలని, విద్యార్థులు, మహిళలు, యువతను సమీకరించాలని, జిల్లా ఇంచార్జ్ మంత్రి సహా ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని అధికారులకు బాధ్యతలు పురమాయించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, కళా ప్రదర్శనలకు ఇబ్బంది తలెత్తకుండా సౌండ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, కళాకారులకు తగిన వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని మార్గనిర్దేశం చేశారు. వేదిక వద్ద అవసరమైన పక్షంలో అత్యవసర సేవల కోసం వైద్య బృందం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజా పాలన విజయోత్సవ కళా యాత్ర కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అవసరమైన
అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పిడి రాజేందర్, డి పి ఆర్ ఓ పద్మశ్రీ, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్ ఉమేష్ చంద్ర, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి స్రవంతి, ఏసిపి రవీందర్ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ముత్తెన్న, తహసిల్దార్లు నాగార్జున, బాలరాజు, ఎస్సీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల ఆర్ సీ ఓ లు తదితరులు పాల్గొన్నారు.