కామారెడ్డి, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సిడిపిఒ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాల పనితీరు, పిల్లల హాజరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీడీపీఓ లు, సూపర్వైజర్ లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు సక్రమంగా ఆన్ లైన్లో నమోదుచేయాలని, సిడీపీఓలు ఫీల్డ్ విజిట్ చేసి పిల్లల హాజరు శాతం పరిశీలించాలని తెలిపారు.
సామ్, మామ్ పిల్లల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి అవసరమైన పక్షంలో న్యూట్రీషియన్ కేంద్రాలకు పంపించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు బాలామృతమ్, మురుకులు, పాలు, గ్రుడ్లు తదితర పౌష్టికాహారం అందించాలని తెలిపారు. అంగన్వాడీ భవన నిర్మాణ పనులను సిడిపిఒలు పరిశీలించాలని తెలిపారు. భవన నిర్మాణాలు వెంటనే పూర్తిచేయాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. అంతకు ముందు జిల్లా కార్యాలయంలో సిబ్బంది చేస్తున్న పనులపై సమీక్షించారు. బయో మెట్రిక్ హాజరు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి చందర్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్ర శేఖర్, పంచాయతీ రాజ్ ఈఈ లు దుర్గా ప్రసాద్, ఆంజనేయులు, డిప్యూటీ ఈఈ లు, సిడిపిఒలు, సూపర్వైజర్ లు, తదితరులు పాల్గొన్నారు.