నిజామాబాద్, నవంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తైన సందర్భంగా ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కళా యాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం డిసెంబర్ 07 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనుంది. సమాచార, జిల్లా పౌర సంబంధాల అధికారి ఆద్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాయాత్ర ప్రదర్శనల కోసం వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్ల తో సిద్ధం చేయగా,సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
ప్రజా విజయోత్సవాలు ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7 వరకు జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థ, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు, అన్ని మండలాల్లోని ఆయా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి, ఇందిరా మహిళాశక్తి, గృహ జ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లపై ప్రచారం చేయనున్నారు.
ప్రతి రోజు మున్సిపాలిటీల్లోని ఆయా వార్డులు, మండలాల పరిధిలోని మూడు గ్రామాల్లో 12 మంది సభ్యులతో కూడిన కళాబృందం ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్‌ఓ ఎన్.పద్మశ్రీ, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.