అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

నిజామాబాద్‌, నవంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రజల ఆమోదంతో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ జనరంజక పాలనను అందిస్తోందని నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్‌ ఆర్‌.భూపతి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రగతికోసం అహరహం శ్రమిస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలుస్తూ ఆశీర్వదించాలని కోరారు.

ముఖ్య అతిథులుగా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే ఆర్‌.భూపతి రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ అంకిత్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సంకేత్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ రెడ్డి, ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, మెప్మా పీడీ రాజేందర్‌, అన్ని శాఖల జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువతీయువకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఎంతో ఆసక్తి తో కళాకారుల ప్రదర్శనలను తిలకించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ, అధికారం చేపట్టిన పది నెలల వ్యవధిలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు కొనసాగిన అప్రజాస్వామిక, కుటుంబ పాలనతో విసిగివేసారిన ప్రజలు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటలలోనే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసిందని అన్నారు.

మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్‌ జండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచిందన్నారు. ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను కూడా 1835 కి పెంచిందని ఎమ్మెల్యే వివరించారు. ప్రగతి భవన్‌ ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌ గా మార్చి, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ‘‘ప్రజావాణి’’కి శ్రీకారం చుట్టి, వారంలో రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని తెలిపారు.

ఏడాది కాలంలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తూ, నిరుద్యోగ యువతలో భరోసా కల్పించేందుకు జాబ్‌ క్యాలెండర్‌ ను ప్రకటించిందని గుర్తు చేశారు. హాస్టల్‌ విద్యార్థులకు కాస్మెటిక్స్‌, మెస్‌ చార్జీలను గణనీయంగా పెంచిందని, పాఠశాలల బలోపేతానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ మౌలిక సదుపాయాలు పెంపోందిస్తోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పరంగా ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో సామాజిక, ఆర్ధిక పరిస్థితుల విశ్లేషణ కోసం ఇంటింటి సమగ్ర సర్వే జరిపిస్తోందని తెలిపారు. దీనిని చూసి జీర్ణించుకోలేకపోతున్న ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 15.12.2023 నుండి ఇప్పటివరకు ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ ప్రెస్‌ బస్సులలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు 125.91 కోట్ల రూపాయల లబ్ది చేకూరిందన్నారు. జిల్లాలో ప్రతిరోజూ సగటున 93 వేల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు.

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో 21890 మందికి 85 కోట్ల 78 లక్షల రూపాయల విలువ చేసే ఉచిత వైద్య సేవలు పొందారని, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగిస్తున్న గృహాలకు ఉచిత విద్యుత్‌ ను అందిస్తోందని, ఈ పథకం కింద జిల్లాలో ఆయా కుటుంబాలకు రూ. 75.81 కోట్ల మేరకు లబ్ది చేకూరిందన్నారు. అదేవిధంగా రూ. 500లకే వంట గ్యాస్‌ పథకం ద్వారా జిల్లాలో 2,19,330 కుటుంబాలకు 19.62 కోట్ల రూపాయల లబ్ది సమకూరిందని కలెక్టర్‌ తెలిపారు.

రూపాయలు రెండు లక్షల లోపు పంట రుణాల మాఫీ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 83 వేల 61 మంది రైతులకు వారివారి ఖాతాలలో రూ. 626.49 కోట్లు జమ చేయడం జరిగిందని, అభయహస్తం హామీల అమలు కోసం గ్రామగ్రామాన ‘‘ప్రజాపాలన’’ కార్యక్రమం నిర్వహించి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతీ యువకుల్లో సాంకేతిక, నైపుణ్యాలను పెంపొందించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటిఐ లను ఏటీసీ (అధునాతన సాంకేతిక కేంద్రాలు) గా తీర్చిదిద్దుతోందని, టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ వారి సహకారంతో ఐటిఐలను అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునికరించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే జిల్లాకు ఐదు ఏటీసీలను మంజూరు చేయగా, తొలి విడత కింద జిల్లాలోని నిజామాబాద్‌, బోధన్‌, కమ్మరపల్లిలో ఏటీసీ సెంటర్లను ఈ ఏడాది నుంచే ప్రారంభించి నిర్దేశిత ఆరు కోర్సులలో శిక్షణకు శ్రీకారం చుట్టామని కలెక్టర్‌ తెలిపారు.

ప్రజల సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల స్థితిగతులను విశ్లేషించేందుకు వీలుగా నవంబర్‌ 6 నుండి ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తోందని, జిల్లాలో సర్వే ప్రక్రియ తుది దశకు చేరిందన్నారు. అన్ని వివరాలను సమగ్రంగా ఆన్లైన్‌ లో నమోదు చేసేలా జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 4,69,988 కుటుంబాలకు గాను నవంబర్‌ 19 నాటికి 3,98,662 కుటుంబాల వివరాలను (84.8 శాతం) ఎన్యూమరేటర్లు నమోదు చేయడం పూర్తయ్యిందన్నారు.

వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో రైతుల శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతోందని, ఖరీఫ్‌ సీజన్లో రైతులు పండిరచిన వరి ధాన్యం సేకరించేందుకు వీలుగా జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా 670 పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, నవంబరు 21, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »