నిజామాబాద్, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల మరియు విభిన్న వ్యక్తుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 నుండి 17 సంవత్సరాల లోపు దివ్యాంగ బాలబాలికలకు, విద్యార్థినీ విద్యార్థులకు మరియు 18 నుండి 54 సంవత్సరాల లోపు దివ్యాంగులకు ఆటల పోటీలను అనగా ట్రై సైకిల్స్ రేసు, రన్నింగ్ చెస్ క్యారమ్స్ షాట్ పుట్ లాంటి ఆటలు పోటీలను జిల్లా క్రీడా మైదానము పాత కలెక్టర్ గ్రౌండ్‌లో నిర్వహించారు.
ఆటల పోటీలలో స్వచ్ఛంద సంస్థల అయినటువంటి స్నేహ సొసైటీ ఏపీ ఫోరం గ్రీసి ఆర్గనైజేషన్ ద్వారా నడపబడుచున్న ప్రత్యేక పాఠశాలలోని మానసిక దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులు, అంద విద్యార్థులు, బదిర విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులతోపాటు జిల్లాలో గల పలు మండలాల నుండి వివిధ రకాల దివ్యాంగులు, డిఆర్డిఏ ఆధ్వర్యంలో, మండల సమాఖ్య నుండి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నడపబడుచున్న భవిత సెంటర్ల నుండి, మెప్మా కార్యాలయం ద్వారా నడపబడుచున్న సమాఖ్యల నుండి వివిధ రకాల దివ్యాంగులు, ప్రభుత్వ బాలుర వసతిగృహం విద్యార్థులు ఇట్టి ఆటల పోటీల్లో పాల్గొన్నారు.
కాగా అదనపు కలెక్టర్ అంకిత్ పాల్గొని జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎస్.కె రసూల్ బి, జిల్లా దివ్యాంగుల కమిటీ సభ్యులు రాజన్న, స్నేహ సొసైటీ సెక్రటరీ సిద్దయ్య, జ్యోతి, ఏపీ ఫోరం సెక్రెటరీ రమేష్, స్వరూప, గ్రేసీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ శోభా, పిఈటిలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.