డిచ్‌పల్లి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కబ్జా అయిన తెలంగాణ యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకొని, కబ్జాదారుల నుండి రక్షించాలని, యూనివర్సిటీ చుట్టూరా ప్రహరీగోడ నిర్మించుటకై తగు చర్యలు తీసుకోవాలని పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు 2006లో ఐక్యంగా పోరాడితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిచ్‌పల్లిలో తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. 574 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించారన్నారు. తే.యు. భూముల్లో 54 ఎకరాలను తమ సొంత భూములని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్పుడు రికార్డులతో భూమిని కాజేయాలని చూస్తే, అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరప్రసాద్‌లు సీరియస్ గా స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వత్తాసు పలికిన ఎమ్మార్వో రవికుమార్‌ను సస్పెండ్ చేశారన్నారు.
ఈ భూములను దక్కించుకోవాలని రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు కోర్టుకు వెళితే కోర్టు సైతం తెలంగాణ యూనివర్సిటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఈ 54 ఎకరాల తె.యూ. భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారుల, కబ్జాదారుల నుండి కాపాడి పూర్తిస్థాయిలో తెలంగాణ యూనివర్సిటీకి అప్పగించాలని కోరారు. ఈ కేసులో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని యూనివర్సిటీ భూమిని పరిరక్షించేలా తగు చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లా కలెక్టర్‌గా బాధ్యత తీసుకోవాలని కోరినారు. అదేవిధంగా భూమిని స్వాధీనపర్చుకొని, యూనివర్సిటీ చుట్టూరా ప్రహరీగోడ నిర్మించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరినారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు నాయకులు తరుణ్, మహేష్, సృజన్ తదితరులు పాల్గొన్నారు.