నిజామాబాద్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జక్రాన్ పల్లి మండలం మాదాపూర్ గ్రామంలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పైలెట్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ ద్వారా సంబంధిత యాప్ లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సొంత స్థలం కలిగి ఉన్నారా, ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి యజమాని ఎవరు, పాత పెంకుటింట్లో ఉంటున్నారా లేక పక్క గృహమా తదితర అంశాలను పరిశీలిస్తూ ఆన్లైన్ యాప్ లో నమోదు చేశారు. గ్రామంలో ఇప్పటివరకు ఎంతమంది వివరాలను సేకరించారు, ఆన్లైన్లో ఎన్ని వివరాలను అప్లోడ్ చేశారని అధికారుల నుండి సమాచారం సేకరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా వివరాలను సేకరిస్తూ ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. వివరాల నమోదులో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే అధికారుల దృష్టికి తేవాలని, నిర్ణీత గడువులోపు పైలెట్ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం పరిశీలన
కాగా, జక్రాన్పల్లి మండలం మాదాపూర్ గ్రామ పంచాయతీలోని పోలింగ్ బూత్ ను కలెక్టర్ శనివారం సందర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ బూత్ లో రెండవ విడత ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. ఎంతమంది కొత్త ఓటర్ల పేర్లు నమోదు చేశారు, మరణించిన ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించారా తదితర వివరాలను బీ.ఎల్.ఓను అడిగి తెలుసుకున్నారు.
ఎస్‌ఎస్‌ఆర్ లో భాగంగా ఇంటింటికి తిరిగి ఓటరు నమోదు వివరాలు సేకరించిన సమయంలో కొత్తగా గుర్తించిన ఓటర్లందరి పేర్లు తప్పనిసరిగా జాబితాలో ఉండేలా చూసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా పేర్లు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. 30 నుండి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఓటరుగా పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటే, అలాంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరపాలని, ఇదివరకు వారు ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉన్నారా అన్నది నిశితంగా పరిశీలన చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జక్రాన్పల్లి తహశీల్దార్ కిరణ్మయి తదితరులు ఉన్నారు.