నిజామాబాద్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మేరా యువభారత్ మరియు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సోమవారం ఉదయం నుండి సుభాష్ నగర్ నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ పోటీలో వివిధ కళాశాలలకు చెందిన 14 బృందాలు పాల్గొన్నాయి.
10 రౌండ్లలో రాజ్యాంగము సైన్స్ టెక్నాలజీ జనరల్ నాలెడ్జ్ ఇతర రంగాలకు సంబంధించిన ప్రశ్నలకు యువతి యువకులు పోటాపోటీగా సమాధానాలు చెప్పి ఉత్సాహపూరిత వాతావరణంలో పోటీలు పూర్తయ్యాయి.
ఈ పోటీలో ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క మానసిక ఉల్లాసానికి ఈ క్విజ్ పోటీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆసక్తిని విద్యార్థుల్లో పెంచుతుందని ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నెహ్రూ యువ కేంద్ర బృందాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డివిజన్ స్థాయిలో కూడా మరిన్ని పోటీలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థులు అందరినీ భాగస్వామ్యం చేయాలని వారు సూచించారు.
విశిష్ట అతిథిగా హాజరైన ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం మనకు హక్కులతో పాటు విధులను కూడా ఇచ్చిందని హక్కులను వాడుకుంటున్న మనం విధులను కూడా నిర్వర్తించాలని అందుకోసము ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సంకల్పం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
పోటీల నిర్వాహకురాలు ,జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో నిర్వహించబడుతున్న ఈ క్విజ్ పోటీల ముఖ్య ఉద్దేశము రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడం కోసమేనని తెలిపారు.
పోటీలలో కాకతీయ మహిళా జూనియర్ కళాశాల యువతి యువకుల బృందం ప్రథమ స్థానంలో మరియు ఎస్.ఆర్ కళాశాల యువతీ యువకుల బృందము ద్వితీయ స్థానంలో నిలిచారు. పోటీలలో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు మరియు మేరా యువభారత్ అందించిన నూతన సంవత్సర డైరీని అందించారు.
కార్యక్రమంలో పలు జూనియర్ కళాశాల సిబ్బంది మరియు నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.