నిజామాబాద్, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారు అక్కడ దేవతలను పూజించినట్టేనని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి పేర్కొన్నారు. కుటుంబంలోని మహిళల మధ్య సఖ్యత సమన్వయం ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తలేవని వారు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో గల జిల్లా న్యాయ సేవ అధికారసంస్థ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ హింస వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ నిర్వహించబడుతున్న సఖి వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి, ట్రైనీ కలెక్టర్ సాకేత్ కుమార్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి మరియు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టిలో మహిళకు ఓ గొప్ప స్థానం ఉందని మహిళను గౌరవించుకోవడం జరుగుతుందన్నారు. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతను పూజించినట్టు వారు చెప్పారు. కానీ ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎప్పుడైతే కుటుంబంలో అమ్మాయి అబ్బాయి అని తేడా చూపిస్తూ పెంచడం వలన కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని వారు చెప్పారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆడవారి పట్ల గౌరవంగా ఉండడం గౌరవంగా నడుచుకోవడం మంచి నడవడిక పద్ధతులు నేర్పినట్లయితే అదే నడవడికతో పిల్లలు సమాజంలో ఉంటారని తెలిపారు. అదేవిధంగా కుటుంబంలో కుటుంబ పెద్దలను పిల్లలు గౌరవిస్తే అది చూసి ముందు తరాల పిల్లలు కూడా గౌరవించడం నేర్చుకుంటారని తెలిపారు. ముఖ్యంగా ఎప్పుడైతే మహిళలు గౌరవింపబడతారో అప్పుడు సమాజంలోని మహిళలను కూడా గౌరవంగా చూడడం జరుగుతుందని వారు చెప్పారు.
మహిళల సంరక్షణార్ధం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఇంట్లో పెద్దలు మంచి చెడు చెప్పకపోతే ఇలాంటి నైతిక విలువలు కోల్పోయి మహిళలపై దాడులకు పాల్పడుతారని తెలిపారు. సుమారు కొన్ని వేల కేసులు గృహహింస కేసులు, వరకట్న వేధింపుల కేసులు నమోదు కావడం బాధాకరంగా ఉందని న్యాయమూర్తి పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని కేసులు నమోదు కావడానికి కారణం కూడా ఇంట్లో పెద్దలు చిన్నపాటి సమస్యలు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడం కలుపుకొని పోవడంతో కేసుల వరకు వెళ్ళవని వారు చెప్పారు. అనవసరంగా కేసుల బారిన వెళ్లి ప్రశాంతమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు.
ఒక కుటుంబం నిలవాలంటే ఇంటి పెద్దల బాధ్యత ముఖ్యంగా ఉంటుందని మరోసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు మహిళలు ప్రదర్శించిన నాటక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. పలువురు మహిళలను అలాగే నాటక ప్రదర్శన చేసిన చిన్నారులను మరియు వివిధ రంగాల్లో సేవలు అందించే మహిళ లను ఘనంగా సన్మానించారు. వీరిలో వైద్య రంగం డాక్టర్ రోహిణి, న్యాయవాది వసంత కుమారి, టీచింగ్ ఎన్.విమల సమాజ సేవా రంగంలో లక్ష్మి దేవి, స్పోర్ట్స్ రంగంలో శ్రీవాణి, పరిశ్రమిక రంగంలో లతలను సన్మానించారు.
కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, సఖి అడ్మినిస్ట్రేషన్ భానుప్రియ, కౌన్సిలర్లు, సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.