జగిత్యాల, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఖతార్‌లో పనిచేస్తూ జాడ తెలియకుండా పోయిన తన భర్త రాసూరి రాజేందర్ ఆచూకీ కనిపెట్టాలని అతని భార్య సునీత మంగళవారం హైదరాబాద్‌లో ప్రవాసీ ప్రజావాణిలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్‌కి విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఉన్నారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్‌కు చెందిన రాసూరి రాజేందర్ ఖతార్‌లో తన ఉద్యోగం పోయిందని, మాల్టా దేశానికి వెళ్ళడానికి రూ.5 లక్షలు కావాలని తల్లిని, భార్యను కోరగా వారు అప్పుజేసి ఇండియా నుంచి ఖతార్‌కు సొమ్ము బదిలీ చేశారు. డబ్బు ముట్టిన తర్వారా ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడని, గత ఆరు నెలలుగా జాడ తెలియడంలేదని ఖతార్‌లో ఉన్నాడా? ఇండియాలో ఉన్నాడా? వెతికి పెట్టాలని ఆమె కోరింది. పోలీసుల ద్వారా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయించాలని జగిత్యాల జిల్లా స్త్రీ శశు సంక్షేమ అధికారి నరేష్‌ను దివ్యా దేవరాజన్ ఆదేశించారు.