నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం, అల్పాహారం కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భోజనం వండడానికి ముందే ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతా లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని ఆదేశించారు.
ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు కోసం వండిన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, వాటి కాలపరిమితిని తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, భోజనం నాణ్యతను పరిశీలిస్తున్నారా అని ఉపాధ్యాయులను ఆరా తీశారు.
సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసినట్లైతే తహశీల్దాం కు సమాచారం అందించాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులు కేటాయించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ సూచించారు. విద్యార్థిని, విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ప్రతిరోజూ ఉపాధ్యాయులు వంతుల వారీగా ఆహార పదార్థాల నాణ్యతను తప్పనిసరి పరిశీలించాలని ఆదేశించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నీటి వసతి, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, ఎక్కడైనా సౌకర్యాల లేమి ఉన్నట్లయితే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చేపట్టేందుకు వీలుగా వెంటనే ప్రతిపాదనలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
ధర్పల్లి మండలం రామడుగుప్రాజెక్టు గ్రామంలో ఐడీసీఎంఎస్, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను గమనించి ధాన్యం సేకరణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యం నాణ్యతను, తేమ శాతాన్ని మాయిశ్చర్ మీటర్ ద్వారా పరిశీలించారు.
కేంద్రం వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను ప్రశ్నించగా, ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. క్రమ పద్దతిలో ధాన్యం కాంటా పెడుతున్నారని, వెంటదివెంట ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటు, బోనస్ డబ్బులు కూడా ఖాతాలలో జమ అయ్యాయని తెలిపారు.
కాగా, సరిపడా గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని, హమాలీల కొరత, లారీల కొరత తలెత్తకుండా చూసుకోవాలని కేంద్రాల నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపుల కోసం ధాన్యం సేకరణ పూర్తయిన వెంటనే టాబ్ ఎంట్రీలు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ధర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ, తహశీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు.