నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను ఆన్లైన్ లో నిక్షిప్తం చేయడం జరుగుతోందని, ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ధర్పల్లి తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి, వారికి పలు సూచనలు చేశారు. సమాచార గోప్యతను పాటించాలని, ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఇంటింటి సర్వే వివరాలను ఒక్కో కుటుంబం వారీగా జాగ్రత్తగా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని హితవు పలికారు. వివరాల నమోదులో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే అధికారుల దృష్టికి తేవాలని, సకాలంలో ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇంటింటి సర్వే 99 శాతం పూర్తయిందన్నారు.
సర్వే సందర్భంగా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో వేగవంతంగా నమోదు చేయిస్తున్నామని, ఇప్పటికే లక్ష పైచిలుకు గృహాలకు సంబంధించిన వివరాల నమోదు పూర్తయ్యిందని వివరించారు. అన్ని మున్సిపాలిటీలు, మండలాలలో ఆన్లైన్లో వివరాల నమోదు జరుగుతోందని, ఈ నెలాఖరు డేటా ఎంట్రీని పూర్తి చేస్తామని తెలిపారు. తప్పిదాలకు తావులేకుండా అధికారుల పర్యవేక్షణలో, ఎన్యూమరేటర్ల సమక్షంలో ఆపరేటర్లచే వివరాలు ఆన్లైన్ లో నిక్షిప్తం చేయిస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ధర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ, తహశీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు.