నిజామాబాద్, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా వెంటదివెంట టాబ్ ఎంట్రీలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. టాబ్ ఎంట్రీలలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు.
రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించినప్పటికీ, ట్రక్ షీట్లను తెప్పించుకోవడంలో, టాబ్ ఎంట్రీలు చేయడంలో జాప్యం జరుగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుండి ధాన్యం కొన్న 48 గంటల్లో వారి ఖాతాలలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చొరవ చూపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని నిలదీశారు.
బిల్లుల కోసం రైతులు నిరీక్షించే పరిస్థితి ఉత్పన్నం కాకుండా సత్వరమే ఆన్లైన్లో వివరాలను నమోదు చేసేలా పర్యవేక్షణ చేయాలని స్థానిక తహశీల్దార్ కు బాధ్యతలు పురమాయించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల వివరాలను ఆరా తీసిన కలెక్టర్, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం బస్తాలు తరలించిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్ మిల్లుల వద్ద తరుగు పేరిట కోతలు విధించడానికి వీలు లేదని స్పష్టం చేశారు.
ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, వారు నష్టపోకుండా సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం తరలించిన రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, వెంటనే బిల్లుల చెల్లింపులు జరిగేలా చూస్తామని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.