నిజామాబాద్, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
డిచ్పల్లి మండలం రాంపూర్‌లో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు.
ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. కూరగాయలు, ఆహార పదార్థాలను ఎక్కడపడితే అక్కడ నేలపై ఉంచకుండా స్టీల్ డబ్బాలలో భద్రపర్చాలని, వాటిపై తప్పనిసరిగా మూతలు భిగించాలని, ఏ దశలోనూ ఆహారం కలుషితం కాకుండా అప్రమత్తతో వ్యవహరించాలని హితవు పలికారు.
ప్రతిరోజూ భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాలు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు. భోజనం వండిన తరువాత కూడా విద్యార్థులకు వడ్డించడానికి ముందు రుచి చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. నాసిరకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరిగితే వెంటనే తహశీల్దార్ దృష్టికి తేవాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులను సమకూర్చేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.