హైదరాబాద్, నవంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామానికి చెందిన సుంకరి శ్రీధర్ ఈనెల 17న హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో యూఏఈ దేశంలోని షార్జా ఏర్ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రభుత్వం ద్వారా అడ్వొకేట్‌ను నియమించి శ్రీధర్‌కు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) కల్పించాలని అతని తల్లి ప్రమీల సీఎం ఏ. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం హైదరాబాద్ బేగంపేట మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో దరఖాస్తు చేశారు. ఆమె వెంట కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు ఉన్నారు.
శ్రీధర్ పేరుపై ఉన్న పాత మొబైల్ ఫోన్ సిమ్ కార్డును ఎవరో దుర్వినియోగం చేసి 12,850 దిర్హంలు (రూ.3 లక్షలు) బిల్ చేయడం వలన ఇబ్బంది తలెత్తిందని అతని తల్లి ప్రమీల వాపోయారు. అమాయకుడైన తన కుమారున్ని షార్జా జైలు నుంచి విడిపించి ఇండియాకు తెప్పించాలని ఆమె సీఎం కు విజ్ఞప్తి చేశారు.