యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతు పనులు

నిజామాబాద్‌, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఆయా జిల్లాలలో దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి ప్రజా రవాణ వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా రోడ్లపై గుంతలు లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతులలో మరమ్మతులు చేపడుతుండడం వల్ల చాలాకాలం పాటు రహదారులు మన్నికగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని అన్నారు.

ప్రగతికి చిహ్నంగా నిలిచే రహదారుల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు హితవు పలికారు. స్థానికంగా ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే కలెక్టర్‌ చొరవతో ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని, నిర్ణీత కాలవ్యవధిలో రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు రవాణా వసతిని మెరుగుపర్చేందుకు చొరవ చూపాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సి.సి రోడ్లను బీటీ రోడ్లుగా, బీ.టీ రహదారులను ట్రాఫిక్‌ రద్దీ ఉండే చోట డబుల్‌ రోడ్డుగా మార్చాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని, ఈ మేరకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

ఈ మేరకు వచ్చే సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. కాగా, ఇందల్వాయి – భీంగల్‌ రోడ్డును రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. అటవీ అనుమతుల పేరుతో పనులను పెండిరగ్‌ లో పెట్టడం సరికాదని అన్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాలలో సుదీర్ఘ కాలం నుండి కొనసాగుతున్న ఆర్‌ఓబీ పనులను కూడా త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రోడ్లతో పాటు ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో తాగునీరు, పారిశుధ్యంపై స్పెషల్‌ ఆఫీసర్లు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించేలా చూడాలన్నారు. మిషన్‌ భగీరథ కింద జిల్లాలో సుమారు మూడు వేల కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని, ప్రతి నివాస ప్రాంతంలో ఇంటింటికి రక్షిత నీరు సరఫరా అయ్యేలా పర్యవేక్షణ జరపాలన్నారు. పెండిరగ్లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

ధాన్యం సేకరణపై సమీక్ష సందర్భంగా, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లాలో ఈసారి ఖరీఫ్‌ లో 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని మంత్రి దృష్టికి తెచ్చారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 4 .86 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు పూర్తి చేశామన్నారు. రైతులకు 736 కోట్ల రూపాయల బిల్లులు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని, సన్నాలకు 500 రూపాయల బోనస్‌ కింద 73 కోట్లు చెల్లించామన్నారు.

మిగితా బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగేలా వెంటదివెంట టాబ్‌ ఎంట్రీలు జరిపిస్తున్నామని అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సైతం సన్న బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున రైతులు సన్నధాన్యం సాగు చేసేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని సూచించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం సన్న ధాన్యంకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు అదనంగా బోనస్‌ రూపంలో 500 రూపాయలు అందిస్తోందని అన్నారు. రైతులకు యాసంగి సాగుకు పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా తక్షణమే బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు.

సమీక్షా సమావేశం నిర్వహించడానికి ముందు, ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో రూ. 22 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ. 4 కోట్ల వ్యయంతో చేపడుతున్న నల్లవెల్లి నుండి మంగ్యానాయక్‌ తండా రోడ్డుకు, రూ.18 కోట్లతో చేపడుతున్న నల్లవెల్లి నుండి గౌరారం వెళ్లే రోడ్డు పనులకు మంత్రి శంకుష్ఠాపనలు చేశారు.

ధర్పల్లి లో రూ. 8 కోట్ల నిధులతో చేపట్టనున్న ధర్పల్లి నుండి ఇందిరానగర్‌ విగ్రహం వరకు గల రోడ్‌ పనులకు, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో వినాయక్‌ నగర్‌ నుండి రాజీవ్‌ గాంధీ విగ్రహం వరకు నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రతీ చోట మంత్రికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ధర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జుక్కల్‌ ఎమ్మెల్యే టి.లక్ష్మీకాంత్‌ రావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, ఐడిసిఎంఎస్‌ చైర్మన్‌ తారాచంద్‌ నాయక్‌, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలో యూత్‌ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తా…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »