నిజామాబాద్, డిసెంబరు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య ఉత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు హాజరవగా, ఆయా జిల్లాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను, మైత్రి ట్రాన్స్ క్లినిక్ లను హైదరాబాద్ నుండి మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేంనరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.
స్థానికంగా నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నియామకం చేసిన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైద్య రంగానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడిరచారు. ఇందులో భాగంగానే 7800 మంది నర్సింగ్ ఆఫీసర్లను ఇప్పటికే నియమించగా, తాజాగా అసిస్టెంట్ సర్జన్ ల ఖాళీలను భర్తీ చేశామన్నారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో మరో 6496 ఖాళీలు భర్తీ కానున్నాయని వివరించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన 10 నెలల వ్యవధిలోనే 55 వేల ఉద్యోగ నియామకాలు జరిపి సరికొత్త చరిత్రను లిఖించడం జరిగిందన్నారు.
ఒక్క వైద్య శాఖలోనే ఏడాది కాలంలోనే 14 వేల ఉద్యోగాలను, డీఎస్సీ ద్వారా 11 వేల మంది ఉపాధ్యాయుల నియామకాలు చేశామన్నారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా వసతి, సదుపాయాలను పెంపొందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా నూతనంగా 16 నర్సింగ్ కళాశాలను నెలకొల్పామని, 104, 108 అంబులెన్సు సేవలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.
అధికారం చేపట్టిన 48 గంటల వ్యవధిలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. నిరుద్యోగ యువత ఆశయాలకు అనుగుణంగా నియామకాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ ఆయా శాఖలలో ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి, ఎలాంటి ఆక్షేపణలు తావులేకుండా పకడ్బందీగా గ్రూప్ ఎగ్జామ్స్ నిర్వహించి ఉద్యోగ నియామకాలు జరుపుతున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పునరావాస కేంద్రంగా మార్చారని, తమ ప్రభుత్వం రిటైర్డ్ డీజీపీ, సీనియర్ ఐ.ఏ.ఎస్ లను కమిషన్ చైర్మన్ లుగా నియమించి పనితీరులో సమూల మార్పులు తెచ్చిందన్నారు.
విశ్వ విద్యాలయాలకు ఉపకులపతులను నియమించడంతో పాటు బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ ఖజానాపై ఎనలేని ఆర్ధిక భారం పడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్, పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేశామని, తద్వారా రాష్ట్రంలో 25 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ ద్వారా 21 వేల కోట్ల రూపాయల లబ్ది చేకూరిందన్నారు.
సంక్రాంతి పండుగ తరువాత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులతో పాటు పేద ప్రజలకు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నెలనెలా సన్న బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున రాష్ట్రంలోని రైతులు సన్న ధాన్యాన్ని సాగు చేయాలని పిలుపునిచ్చారు. సన్న ధాన్యానికి ఇకముందు కూడా క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ను అందిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అట్టహాసంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తామని వెల్లడిరచారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండదంగా నిలుస్తూ కాపాడుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.