నిజామాబాద్, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న జరిగే రాష్ట్రవ్యాప్త ఆటో, మోటార్‌ల బంద్ పిలుపులో భాగంగా నిజామాబాద్ ఆటో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ భవన్, కోటగల్లిలో బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టీయుసీఐ ఏఐటియుసి, సిఐటియు, బి.ఆర్.టి.యు, ఐ ఎఫ్ టి యు ఆటో యూనియన్ల బాధ్యులు ఎం.సుధాకర్, హన్మాండ్లు, కే.రాములు, శ్రీనివాస్, శివకుమార్, గంగాధర్ మాట్లాడుతూ… మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటోడ్రైవర్ల జీవనం, జీవనోపాధి అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆటోడ్రైవరుకు సంవత్సరానికి రూ.15 వేలు ఆర్థిక సహాయం అమలు చేయాలన్నారు. రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సు వల్ల ఆర్థికంగా నష్టపోయి – ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించాలని కోరారు.
ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించాలని, యాక్సిడెంట్ బీమాను రూ.10లక్షలకు పెంచాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఉదాసీన వైఖరిని నిరసిస్తూ ఆటో బంద్ లో భాగంగా నెహ్రూ పార్ క్ నుండి ధర్నా చౌక్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆటో యూనియన్ల నాయకులు సాయిలు, జబ్బార్, విటల్, మోయిన్, సాయికుమార్, సయ్యద్ రఫీయుద్దిన్, అబ్దుల్ ముజీబ్, మారుతి, నబీ, షేక్ అక్లాక్, సల్మాన్ ఖాన్, షేక్ సోహెల్, వసీం, బాలాజీ, రాజేందర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.