కామారెడ్డి, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని దివ్యాంగుల కోసం 48,446 ధ్రువీకరణ పత్రాలను అందజేశామని, వివిధ రుణాలు అందిస్తున్నామని తెలిపారు.
జిల్లాలో సుమారు 18 వేల మందికి ప్రతీ నెల 7.26 కోట్ల రూపాయల ఫించన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సకలాంగులు వికలాంగులను పెళ్లి చేసుకుంటే ఒక లక్ష రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు. 14 మందికి స్కూటర్లు, 8 మందికి వీల్ చైర్స్ అందించామని అన్నారు. ఎలిన్కో క్యాంపు లను నిర్వహించుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం క్రింద పనులు కల్పించుటలో రాష్ట్రంలోనే నాలుగవ స్థానంలో నిలచామని తెలిపారు.
64 వేల లేబర్ ను జనరేట్ చేశామని, 2661 వేజ్ సీకర్స్ కు పనులు కల్పించామని తెలిపారు. సదరం క్యాంపు స్లాట్ లను 650 కి పెంచామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ, సంస్థ దివ్యాంగులకు అండగా నిలుస్తుందని, ప్రభుత్వం దివ్యాంగులకు కావలసిన అవసరాలను సమకూరుస్తున్నదని తెలిపారు. దివ్యాంగులు మరొకరికి ఆదర్శంగా నిలవాలని తెలిపారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయం మేరకు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం క్రింద సులువు పనులు కల్పిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు ఉపాధి హామీ పథకం కింద పనులు రిజిస్ట్రేషన్ కల్పించుటలో రాష్ట్రంలో నాలుగవ స్థానం, 64 వేల పనులు కల్పించి రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచామని తెలిపారు.
దివ్యాంగుల సంఘం నాయకులు మాట్లాడుతూ, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, అంత్యోదయ కార్డులు అందించాలని, రెండు పడక గదులు ఇళ్ళు మంజూరు చేయాలనీ కోరారు. అనంతరం దివ్యాంగులకు నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఉపాధి హామీ పథకం కూలీలను, సిబ్బందిని శాలువా, బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించడం జరిగింది.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా సంక్షేమ అధికారి చందర్ నాయక్, దివ్యాంగుల యూనియన్ నాయకులు, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.