నిజామాబాద్, డిసెంబరు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బస్ డిపో – 1 ముందు ధర్నా నిర్వహించి, ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్నకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో స్త్రీలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రారంభించడం హర్షనీయమన్నారు. ఈ పథకానికి మహిళల నుండి మంచి స్పందన వచ్చిందనీ, కానీ ప్రయాణికుల రద్దీ పెరుగుతూ వుంటే, ప్రభుత్వం బస్సుల సంఖ్య తగ్గిస్తుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించి, రాష్ట్ర వ్యాపితంగా ఇటీవల 3 వేల బస్సులు తగ్గించడం ప్రభుత్వ కుట్రపూరిత చర్యగా భావిస్తున్నామన్నారు. ఉచిత ప్రయాణం హక్కు తప్ప, బిక్ష కాదని గుర్తించాలన్నారు. ఇప్పటికే చాలా బస్సులు పాతబడి, నిరంతరం రిపేర్లకు గురవుతున్నాయనీ, అదనపు బస్సులు పెంచాల్సిన సమయంలో తగ్గించడం వలన బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు.
బస్ స్టాండ్లల్లో బస్సులు ఆగక, ఆగినా ఎక్కలేక ప్రయాణికులు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి ఒక చేత్తో రాయితీ ఇచ్చి, మరొక చేత్తో నష్టం చేసేలా కనబడుతున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన జిల్లాలో వున్న బస్ స్టేషన్లల్లో కనీస మౌలిక సౌకర్యాలు కరువయ్యాయనీ ఆరోపించారు. స్వచ్ఛమైన తాగునీరు, మలమూత్రశాలలు పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. ఆర్టీసీ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికుల రద్దీనీ దృష్టిలో పెట్టుకొని, బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న సహాయ కార్యదర్శి సాయన్న నగర కార్యదర్శి ఎం.సుధాకర్ జిల్లా నాయకులు కే.గంగాధర్, డి.రాజేశ్వర్, డి.కిషన్, బి.మురళి పీఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే సంధ్యారాణి పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేష్ పీ.వై.ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా వివిధ ప్రజా సంఘాల నాయకులు మోహన్, సాయి రెడ్డి, అమూల్య, లలిత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.