నిజామాబాద్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల నుండి అభ్యర్థనలు స్వీకరించేందుకు వీలుగా ఏర్పాటైన బీసీ డెడికేటెడ్ కమిషన్ గురువారం నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిజామాబాద్ ఉమ్మడి (నిజామాబాద్, కామారెడ్డి) జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి బి.సైదులు ఆయా కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల నుండి రాతపూర్వకంగా విజ్ఞాపనలను స్వీకరించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న కమిషన్ చైర్మన్ కు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నాయి బ్రాహ్మణ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ముదిరాజ్, మేదరి, పూసల సంఘం, వడ్డెర సంఘం, చేతివృత్తుల, కుల సంఘాలు, కుమ్మరి, యాదవ, రజక, వీరభద్రీయ, నకాషీ, వాల్మీకి, ముస్లిం మైనారిటీ, దూదేకుల, బాగ్బాన్, మేర, గాండ్ల తేలికుల, మత్స్య సహకార తదితర సంఘాల ప్రతినిధులు తమతమ కులాలవారి ఆర్ధిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ స్థితిగతులను కమిషన్ చైర్మన్ కు వివరిస్తూ విజ్ఞాపనలను సమర్పించారు.
ముఖ్యంగా కుల వృత్తులపై ఆధారపడి జీవనాలు వెళ్లదీస్తున్న తమకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని, ఇప్పటివరకు స్థానిక సంస్థలలో స్థానం లేని కులాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేలా ప్రతిపాదించాలని, నాయిబ్రాహ్మణ వృత్తికి ప్రమాదకరంగా పరిణమించిన కార్పొరేట్ సంస్థలను నియంత్రిస్తూ తమకే పేటెంట్ హక్కులు కల్పించాలని, పూసల జాతిని ఎంబీసీ జాబితాలో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని, చేతివృత్తులు, కుల సంఘాలను ఏ, బి, సి, డి వర్గీకరణ చేస్తే మేలు జరుగుతుందని, బీసీలకు రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేయాలని, మేదరి కులస్తులను ఇతర రాష్ట్రాల తరహాలో తెలంగాణాలో కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని, ముస్లిం మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో 12.5 శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలని, బాగ్బాన్ కులానికి గుర్తింపు కల్పించాలని ఆయా సంఘాల ప్రతినిధులు కమిషన్ కు విజ్ఞాపనలు అందజేశారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐ.ఏ.ఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, స్థానిక సంస్థలలో బీ.సీ రిజర్వేషన్లు ఎలా ఉండాలనే దానిపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటయ్యిందని తెలిపారు. ప్రత్యేకించి గ్రామపంచాయతీలో, వార్డులో, జిల్లా, మండల పరిషత్ లలో ఎంత శాతం రిజర్వేషన్ ఉండాలో పేర్కొనే విషయమై కమిషన్ ఏర్పాటయ్యిందని చేసినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా వివిధ జిల్లాలలో కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలతో అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతున్నదని, ఇప్పటివరకు 8 ఉమ్మడి జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం అన్ని అంశాలను కూలంకశంగా పొందుపరుస్తూ సమగ్ర నివేదిక సమర్పిస్తామని అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా, బీసీల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉండాలనే అంశంపై ఎక్కువ మంది వారి విజ్ఞాపనలు అందించారని, కులాలను ఏ, బి, సి, డి గా వర్గీకరణ చేస్తే ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయాన్ని వెలుబుచ్చారని అన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని కులాలకు అవకాశాలు కల్పించాలని, తదితర అంశాలకు సంబంధించి విజ్ఞాపనలు సమర్పించినట్లు చైర్మన్ వివరించారు.
ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, కామారెడ్డి జెడ్పి సీఈఓ చందర్ రాథోడ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ అధికారి రమేష్ తదితరులు ఉన్నారు.