నిజామాబాద్, డిసెంబరు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం పనితీరు భేషుగ్గా ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) సి.సుదర్శన్ రెడ్డి ప్రశంసించారు. ఇతర అన్ని జిల్లాలతో పోలిస్తే ముసాయిదా ఓటరు జాబితా రూపకల్పన, మార్పులు, చేర్పులకు సంబంధించి దాఖలైన దరఖాస్తుల పరిష్కారం, రికార్డుల నిర్వహణలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారని సంతృప్తి వెలిబుచ్చారు.
జిల్లా పర్యటనకు హాజరైన సీఈఓ సుదర్శన్ రెడ్డి శుక్రవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి నిజామాబాద్ నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో కొనసాగుతున్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఈ.ఆర్.ఓ ఆఫీసును, బోధన్ లోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గల బోధన్ నియోజకవర్గ ఈ.ఆర్.ఓ ఆఫీసులను సందర్శించారు. నోటీసు బోర్డులపై అతికించిన ముసాయిదా ఓటరు జాబితాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, చిరునామాల మార్పు, పేర్ల తొలగింపు తదితర వాటికి సంబంధించిన దరఖాస్తుల పరిష్కారంలో మార్గదర్శకాలు పాటించారా లేదా అని రికార్డులను పరిశీలించి నిర్ధారణ చేసుకున్నారు.
ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం ఆన్లైన్, ఆఫ్ లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఈ.ఆర్.ఓలకు కీలక సూచనలు చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల నుండి వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, బోధనేతర విధుల్లో కొనసాగే వారి పేర్లు ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటరు జాబితాలో ఉండకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు.
ఓటరు జాబితా నుండి మృతి చెందిన వారి పేర్లు తొలగించే సందర్భంలో మరణ ధ్రువీకరణ పత్రం జత చేయాలని, కుటుంబ సభ్యుల నుండి నిరభ్యంతర పత్రం తీసుకోవాలని సూచించారు. జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఉన్నందున, పొరుగు రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్న పలువురు స్థానికంగా కూడా ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపిన మీదట అర్హులైన వారి దరఖాస్తులను మాత్రమే ఆమోదించాలని అన్నారు.
అనంతరం సీఈఓ వినాయకనగర్ లోని ఈవీఎం గోడౌన్ ను సందర్శించి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బీ.యూలు, సీ.యులు, వీవీ.ప్యాట్ ల భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. సీసీ కెమెరాలు సక్రమంగానే పని చేస్తున్నాయా లేదా అని గమనించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు కలిగి ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో సీఈఓ సమీక్ష జరిపారు. ఎస్.ఎస్.ఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సీఈఓ కు వివరించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయని, ఇకముందు కూడా ఇదే తరహా శ్రద్ధ చూపాలని అన్నారు.
ఎన్నికల నిర్వహణ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, శాసనసభ, పార్లమెంటు సాధారణ ఎన్నికలు ముగిసినందున ప్రస్తుతం లభించిన వెసులుబాటును సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా ఓటరు జాబితా రూపొందేలా కృషి చేయాలని హితవు పలికారు. ఒక కుటుంబానికి చెందిన సభ్యులందరు ఒకే పోలింగ్ బూత్ పరిధిలో ఓటు హక్కు కలిగి ఉండేలా చూసుకోవాలని, చిరునామాలో తప్పులు, మార్పులు ఉంటే సరిచేసుకోవాలని, ఓటరు లిస్టులో ఫోటో స్పష్టంగా ఉండాలని అన్నారు.
ఎస్‌ఎస్‌ఆర్ లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు సమాచారం తెలియజేయాలని, క్రమం తప్పకుండా వారితో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాల్సిందిగా గుర్తింపు పొందిన పార్టీలకు తెలియజేయాలని అన్నారు.
ఈ నెల 9 వరకు ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు అవకాశం : కలెక్టర్
నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం ఈ నెల (డిసెంబర్) 9 వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ సందర్భంగా సూచించారు.
ఆన్లైన్ లో లేదా ఏఈఆర్‌ఓ కార్యాలయాల్లో నేరుగా కూడా ఓటర్లు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు జాబితాలో పేర్ల నమోదు కోసం గడువు లోపు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, కిరణ్మయి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ తదితరులు ఉన్నారు.