నిజామాబాద్, డిసెంబరు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా ఎన్ సీ సీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది జిల్లా పాలనాధికారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, గౌరవ వందనం సమర్పించారు. అదనపు కలెక్టర్ అంకిత్ తో పాటు కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమవంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అన్నారు. వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెళ్లదీస్తున్నామని అన్నారు. సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ, వారి పట్ల, వారి సేవల పట్ల గౌరవభావంతో మెలగాలని, సాయుధ దళాలకు మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఇంచార్జ్ అధికారి రమేష్, కార్యాలయ సిబ్బంది సులేమాన్, బదాం గంగామోహన్, ఉమేర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.ప్రసాద్, కార్యదర్శి బి.రవికాంత్, యం.దివాకర్ రెడ్డి, గుజరాతీ మోహన్, అబ్రహం, సుజాత, సరస్వతి, లలిత, లక్ష్మీ, జయశ్రీ, కామారెడ్డి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, మాజీ సైనికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.