కామారెడ్డి, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. జిల్లాలో మొత్తం 535 గ్రామ పంచాయతీలు, 4686 వార్డులు ఉండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 4697 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు.
ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12వ తేదీలోపు తెలుపవచ్చని, 12న అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని, కలెక్టర్ ఆమోదం అనంతరం ఈ నెల 17న అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించబడుతుందని అన్నారు.
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం 2025 ప్రకారం జుక్కల్ నియోజక వర్గంలో 14043, ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 14,319, కామారెడ్డి నియోజకవర్గంలో 23,352 క్లెయిమ్స్ రావడం జరిగాయని తెలిపారు. ఈ నెల 24లోగా క్లెయిమ్స్‌ను పరిష్కరించాలని తెలిపారు. 6 జనవరి 2025 రోజున ఫైనల్ పబ్లికేషన్ ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. బూత్ స్థాయి ఎజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ అన్నారు.
గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గానికి ఈ నెల 9 నాటికి అందిన క్లెయిమ్స్‌ను పరిశీలించి డిసెంబర్ 25 లోగా డిస్పోజ్ చేయడం జరుగుతుందని, డిసెంబర్ 30 న ఫైనల్ పబ్లికేషన్ ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.