కామారెడ్డి, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి సంబంధిత శాఖల అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
నివారణ చర్యలు చేపట్టిన వివరాలతో పాటు ఫోటో లను సమర్పించాలని సూచించారు. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర హైవే లపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి శాఖల సమన్వయంతో నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైన చోట్ల విద్యుత్ దీపాలు, సూచికలు, వంటివి ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపుల అనదికారికంగా ఏర్పాటుచేసిన, రవాణా కు ఇబ్బంది కలిగే టీ , టిఫిన్ సెంటర్లను తొలగించాలని తెలిపారు. గత సమావేశంలో చర్చించిన చేపట్టవలసిన పనులను ఆయా శాఖల అధికారులు పూర్తిచేయాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ, ప్రమాదాలను అరికట్టాలని, అందుకు కావలసిన, చేయవలసిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమావేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ సి.ఎస్.రావు, రోడ్లు భవనాల శాఖ ఈ ఈ రవిశంకర్, డిఎస్పీ నాగేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, పోలీసు అధికారులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.