నిజామాబాద్, డిసెంబరు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యార్థినులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా విద్యాభ్యాసం చేస్తూ సాదించాలని నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
సమావేశానికి కళాశాల ప్రిన్సిపల్ బుద్దిరాజు అధ్యక్షత వహించగా, అతిథిగా జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రిన్సిపల్ సేషన్స్ జడ్జి సునీత మాట్లాడుతూ విద్యార్థినులు విద్యను అభ్యసించడం తమ హక్కు అని, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా భవిష్యత్తు విద్యాభ్యాసాన్ని చేస్తూ తాను అనుకున్నది సాధించాలని ఉద్భోదించారు.
ప్రతి మహిళా ఉన్నతంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం విద్యార్థి దశనుండే అలవర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. అన్నిటికి మూలం విద్యాభ్యాసమేనని, ప్రస్తుతం కష్టపడి విద్య నేర్చుకోవడం పై ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని అన్నారు. అన్ని రంగాలలో మహిళలు ముందు ఉండాలని, ఉచిత న్యాయ సహాయం కూడా పొందవచ్చు అని అన్నారు.
జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పద్మావతి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే హక్కుల గురించి తెలుసుకోవాలని అన్ని విషయాలలో జిల్లా న్యాయ సేవా సంస్థ మహిళలకు హక్కుల పరిరక్షణ కోసం న్యాయ సేవ అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఏ అన్యాయం జరిగినా న్యాయ సేవా సంస్థ ఉచిత న్యాయ సహాయం చేస్తుందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ విద్యార్థి దశనుండే హక్కుల తో పాటు విధులను కూడా సక్రమంగా నిర్వర్తించాలని ఉద్బోధించారు.
జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ మాట్లాడుతూ సమాజాభివృద్ధికి విద్యార్థి దశ నుండి బాధ్యతయుతంగా వ్యవహరించాలని అన్నారు. ప్రతి మహిళ, విద్యార్థినీ యీ అన్యాయం జరిగినా ఉచిత న్యాయ సహాయం పొందడానికి జిల్లా న్యాయ సేవా సంస్థ ను సంప్రదించాలని విద్యార్థినులకు సూచించారు. సమాజంలో ఉన్న రుగ్మతలను నిర్మూలించడానికి మహిళల పట్ల జరుగుతున్న అణచివేత, అకృత్యాలను, నిర్మూలించేందుకు విద్యార్థినులు, యువతులు జాగరూకతతో వ్యవహరించాలని ఉద్బోధించారు.
ప్రిన్సిపాల్ బుద్దిరాజు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులకు జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆవగాహన కల్పించి హక్కులను పొందే విధంగా కృషి చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.